Hero Prabhas Campaign : తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతోంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని భావిస్తోంది. ఈ మేరకు మాదక ద్రవ్యాలు, గంజాయికి వ్యతిరేకంగా ప్రజలకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది.

గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వారికి క్యాష్ రివార్డును సైతం ప్రకటించింది. వీటి నిర్మూలనకు ప్రత్యేకంగా క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలను చేపట్టింది. ఇందులో భాగంగా టాలీవుడ్ సహకారాన్ని సైతం ప్రభుత్వం తీసుకుంటోంది.
హీరోహీరోయిన్లతో మాదక ద్రవ్యాల వినియోగం, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలను వివరించేలా వీడియోలను రూపొందిస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రజల నుంచి ఎంతో తీసుకుంటున్నారని, కొంతైనా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత వారిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
డ్రగ్స్ నిర్మూలనపై హీరో ప్రభాస్ (Hero Prabhas) క్యాంపెన్..
ప్రభుత్వ సూచన మేరకు ఇప్పటికే పలువురు స్టార్స్ డ్రగ్స్ నిర్మూలను వ్యతిరేకంగా ప్రచారానికి సంబంధించి వీడియోలను రిలీజు చేశారు. తాజాగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) 2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియోను రిలీజు చేశారు.
తెలంగాణ సర్కార్, యాంటీ నార్కొటిక్స్ విభాగం సంయుక్తంగా ఈ వీడియోను రూపొందించాయి. ఇందులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్, సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని చూపించారు.
‘‘లైఫ్‌లో మనకు బోలెడన్నీ ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి.. కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది.. మనం ప్రేమించే మనుషులు.. మన కోసం బ్రతికే మనవాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్.. Say no to Drugs today.. మీకు తెలిసిన వాళ్లెవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే ఈ టోల్ ఫ్రీ నంబర్ 8712671111 నంబర్‌కు కాల్ చేయండి.. వాళ్లు పూర్తిగా కోలుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది..’’ అంటూ ప్రభాస్ సూచించారు.
Read Latest Telangana News and Latest News Updates