India wins Women’s Under-19 World Cup 2025 : మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ రెండోసారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది.

వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన భారత్ ఫైనల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండోసారి విశ్వ విజేతగా నిలిచింది.
2025 ఫిబ్రవరి 2న మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా మహిళల అండర్-19 ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది.
ఈ జట్టులో వాస్ వూరస్ట్ (23) టాప్ స్కోరర్ గా నిలిచారు. మిగిలిన బ్యాటర్లంతా పెద్దగా పరుగులేమి చేయలేదు. భారత బౌలర్లలో గొంగడి త్రిష మూడు, వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా, పరుణిక రెండేసి వికెట్లు తీశారు.

షబ్నమ్ ఒక వికెట్ తీసింది. 83 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 11.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.
భారత ఓపెనర్లలో కమలిని (8) విఫలమైనా మరో ఓపెనర్ గొంగడి త్రిష (Gongadi Trisha) 33 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. సానిక 26 పరుగులతో రాణించింది.

Under-19 World Cup 2025.. త్రిష గొంగడి ఆల్ రౌండ్ షో..
ఈ మ్యాచులో తెలుగమ్మాయి గొంగడి త్రిష బాల్ తోపాటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. తొలుత బౌలింగులో మూడు వికెట్లు తీసిన త్రిష.. బ్యాటింగ్ లోనూ ఆకట్టుకుంది. టార్గెట్లో సగం స్కోరు త్రిషనే బాదింది.
ఈ టోర్నమెంట్ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన గొంగడి త్రిషకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తోపాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కింది.
Champions Trophy 2025 : భారత్-పాక్ మ్యాచ్ లు ఎప్పుడంటే
గొంగడి త్రిషను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి..
వరుసగా రెండోసారి అండర్-19 మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా జట్టును ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.
ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ఆటతో టీమిండియా అమ్మాయిల జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ #GongadiTrisha గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
మలేషియా వేదికగా జరిగిన #U19WorldCup ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం సాధించి ఇండియా విశ్వ విజేతగా నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన త్రిష ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు. దూకుడుగా ఆడి చివరి వరకు నిలబడి సత్తా చాటారు. అత్యధిక పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచారు.
గొంగడి త్రిష గారి లాంటి క్రీడాకారులు #Telangana రాష్ట్రానికి గర్వ కారణమని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు.
మరింతగా రాణించి భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకోవాలని ఆకాంక్షించారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యమున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.
ఐసీసీ టీమ్ (ICC Team) కు ఎంపికైన భారత ప్లేయర్లు..
ఐసీసీ జట్టులో నలుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. అండర్-19 ప్రపంచ కప్ లో ఆల్ రౌండ్ షోతో అద్భుత ప్రదర్శన కనబర్చిన గొంగడి త్రిష, అత్యధిక వికెట్లు సాధించిన వైష్ణవి శర్మ, భారత మరో ఓపెనర్ జి. కమిలిని, ఆయుశి శుక్లాలు ఐసీసీ జట్టుకు ఎంపికయ్యారు.
- ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్..
గొంగడి త్రిష (భారత్), జెమ్మా బొతా (సౌతాఫ్రికా), డావి నాస్ (ఇంగ్లాండ్), జి.కమలిని (భారత్), కాయామే బ్రే (ఆస్ట్రేలియా), పూజ మహటో (నేపాల్), కైలా రెనేకె (కెప్టెన్, సౌతాఫ్రికా), కేటీ జోన్స్ (ఇంగ్లాండ్), ఆయుశి శుక్లా (భారత్), చమోడి ప్రాబోదా (శ్రీలంక), వైష్ణవి శర్మ (భారత్), నబిసెంగ్ నిని (సౌతాఫ్రికా).